Home ఎంటర్టైన్మెంట్ ఆ మానవత్వమే రెహమాన్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది!

ఆ మానవత్వమే రెహమాన్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది!

0

సినిమా రంగంలో ఉన్నత స్థానంలో వున్న నటీనటులుగానీ, టెక్నీషియన్స్‌గానీ ఎక్కువ శాతం ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వారే. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి సంగీత దర్శకుల్లో ఒకరైన ఎ.ఆర్‌.రెహమాన్‌ కూడా అలా వచ్చిన వాడే. తన తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందరికీ అతను ఓ సంగీత దర్శకుడిగానే తెలుసు. వ్యక్తిత్వపరంగా ఎలాంటి వాడు, తన మ్యూజిషియన్స్‌ విషయంలో అతను ఎలా ఉంటాడు.. అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారిలో గేయ రచయిత అనంతశ్రీరామ్‌ ఒకరు. ఇటీవల టీవీలో వచ్చిన ఓ కార్యక్రమంలో ఎ.ఆర్‌.రెహమాన్‌ని దగ్గరగా గమనించిన వ్యక్తిగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిరచారు. 

‘ఎ.ఆర్‌.రెహమాన్‌ ఒక మ్యూజిషియన్‌గా పగలు వర్క్‌ చేస్తూనే సాయంత్రం యాడ్స్‌ కోసం జింగిల్స్‌ చేసేవారు. అసలు ఆయన ఎప్పుడు పడుకునేవారు అనే దానికి రెహమాన్‌ దగ్గర కూడా సమాధానం ఉండేది కాదు. చిన్నతనంలో అంత కష్టపడ్డారు. సముద్రం లోతుల్లోకి ఎంతో కష్టపడి వెళితేనే మణులు దొరుకుతాయి. అలా రెహమాన్‌కి ఒక మణి, ఒక రత్నం కలిపి మణిరత్నం అనే దర్శకుడు దొరికారు. అలా రెహమాన్‌ చేసిన మొదటి సినిమాకే నేషనల్‌ అవార్డు గెలుచుకున్నారు. అలాగే భారతదేశానికి తొలిసారి రెండు ఆస్కార్‌ అవార్డులు తెచ్చిపెట్టారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. కానీ, అందరికీ తెలియని ఒక విషయం నేను చెబుతాను. ఆయనలోని మానవత్వమే ఆయన్ని విశ్వ మానవుడిగా నిలబెట్టింది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. తన దగ్గరికి వచ్చే మ్యూజిషియన్స్‌కి బయట ఎంత ఇస్తున్నారో అంతకు రెట్టింపు తాను ఇవ్వగలిగితేనే నేను వారిని పిలవాలి అనుకునేవారు. ఆ పేమెంట్స్‌ అన్నీ మ్యూజిషియన్స్‌కి సరిగ్గా అందించే బాధ్యతను తన తల్లికి అప్పగించారు రెహమాన్‌. మ్యూజిషియన్స్‌కి, సింగర్స్‌కి వాళ్ళ అమ్మగారే పేమెంట్స్‌ ఇస్తుండేవారు. ఈమధ్య ఆమె కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడ్డారు. కోలుకొని నెలరోజుల తర్వాత కర్ర సాయంతో ఆఫీస్‌కి వచ్చారు. అప్పుడు హాల్‌లో ఒక మ్యూజిషియన్‌ కూర్చొని ఉండడాన్ని గమనించిన ఆమె.. ‘ఇక్కడ కూర్చున్నావేం బాబూ’ అని అడిగింది. దానికి అతను ‘నెలరోజుల క్రితం చేసిన రికార్డింగ్‌కి ఇంకా పేమెంట్‌ రాలేదు’ అని చెప్పాడు. ఆ సమయంలో రెహమాన్‌ ముగ్గురు పెద్ద డైరెక్టర్లతో సిట్టింగ్‌లో ఉన్నారు. ఒక్కసారిగా ఆ రూమ్‌ తలుపులు తోసుకొని వెళ్ళి రెహమాన్‌ ముందు నిలబడి ‘వాళ్ళకి పేమెంట్‌ రావడం లేదట. ఏం చేస్తున్నారు మీరు? నేను కొన్నాళ్ళు చూసుకోకపోతే సిస్టమ్‌ మొత్తం మార్చేస్తారా? నీకు గుర్తుందా.. మీ నాన్నగారు పోయిన తర్వాత మనకు పేమెంట్స్‌ రాకపోతే ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందులు పడేవాళ్ళం. అదే పరిస్థితి మిగతా వాళ్ళకి మనం కలిగిస్తామా? వెంటనే వెళ్లి పేమెంట్స్‌ క్లియర్‌ చెయ్‌’ అని చెప్పారు. వెంటనే ఆ సిట్టింగ్‌ ఆపి ఎకౌంట్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళి ఎవరెవరికి పేమెంట్స్‌ ఆగాయో వాళ్ళందరికీ ఒకేసారి ఎమౌంట్స్‌ పంపించేశారు. ఒక వ్యక్తిని ప్రజ్ఞ శిఖరం మీద నిలబెడితే.. అతని మానవత్వం అతన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుందనడానికి రెహమాన్‌గారి జీవితమే ఓ ఉదాహరణ’ అని వివరించారు అనంతశ్రీరామ్‌.  

Exit mobile version