CM Revanth Reddy : ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నీటి పంపకాలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. కేసీఆర్, హరీశ్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగిస్తుందని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోయారన్నారు. దీనికి అప్పుడు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని విమర్శించారు. ఆ తర్వాత సీఎం జగన్, కేసీఆర్ ఇంటికి వచ్చి కృష్ణా నీటి పంపకాలపై 6 గంటలు చర్చించారని గుర్తుచేశారు. ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ జీవో 2020లో ఆమోదం పొందిందన్నారు. ఈ పంపకాలపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందన్నారు.