ఇండియా వైడ్ గా సలార్ తో ప్రభాస్ సృష్టించిన సునామి గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ వరకు సాధించిన సలార్ ఇంకో థియేటర్స్ లో తన సత్తా చాటుతుంది. తాజాగా ప్రభాస్ గురించిన ఒక న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ప్రభాస్ తాజాగా కర్ణాటక లోని మంగుళూరు కి దగ్గరలో ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించాడు. అనంతరం ప్రభాస్ కి ఆలయ పండితులు ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి తీర్ధ ప్రసాదాలని అందించారు. ప్రభాస్ తో పాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో దర్శకుడు ప్రశాంత్ నీల్,నిర్మాత విజయ్ లు కూడా ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు కి దగ్గరలో కటీల్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి తూర్పున నందిని నదిలో ఉన్న ఒక ద్వీపంలో దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. సహజంగా ఏర్పడిన ఈ దుర్గా పరమేశ్వరి అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారనే పేరు ఉంది.అలాంటి ఆలయానికి ప్రభాస్ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ad తో పాటు మారుతీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ని జరుపుకుంటున్నాయి.