Mudragada Padmanabham : ఏపీ రాజకీయాలు ఇప్పుడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకోవాలని నేతలు ముద్రగడ ఇంటికి క్యూకడుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంతో వరుసగా భేటీ అవుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగాఆయన టీడీపీ, జనసేన నేతలతో భేటీ అయ్యారు. దీంతో ముద్రగడ ఆలోచన మార్చుకున్నారని ప్రచారం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి పట్టుచిక్కితే వారిదే రాష్ట్రంలో అధికారం దక్కినట్లే. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు చంద్రబాబు, పవన్ ప్రణాళిక వేస్తున్నారు.