Saturday Motivation: ఏం తినాలో నాన్నే నిర్ణయించాలి. ఏ డ్రెస్ వేసుకోవాలో నాన్నే చెప్పాలి. ఏ చెప్పులు బాగుంటాయో నాన్నే నిర్ణయించాలి, ఏం చదవాలో, ఎలా ఉండాలో అన్నీ నాన్నే నిర్ణయం తీసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఇలా ఉండదు, కానీ కొందరి ఇళ్లల్లో మాత్రం జరిగేది ఇదే. ఇలాంటి నాన్నలను చూసినప్పుడు బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు. అతనికి నచ్చిందే బెస్ట్ అని, తాను తన పిల్లలకు బెస్ట్ మాత్రమే ఇస్తాను అంటూ… తనకు తెలియకుండానే తన నిర్ణయాలను పిల్లలపై రుద్దేస్తాడు. కనీసం పిల్లలకు ఏమి ఇష్టమో కూడా తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదు. అలాగని ఆ నాన్నలు చెడ్డ నాన్నలు మాత్రం కాదు. పిల్లలకు తాము ఉత్తమమైనవే ఎంపిక చేస్తామనే ఉద్దేశంతో ఉన్న నాన్నలు. కానీ అవి పిల్లలకు నచ్చుతాయో లేదో మాత్రం ఆలోచించరు. అలాంటి నాన్నలుగా ఉండడం మానేయండి. మీ పిల్లలతో మనసు విప్పి మాట్లాడే స్నేహితుడిలా మారండి. అవసరమైనప్పుడే దండించండి. అవసరం లేనప్పుడు స్నేహితుడిలా వెంట నడవండి. వారి కష్టాలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను వినండి. వాటిని గౌరవించండి.