అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నంబర్ 73లో నివాసం ఉండే బొల్లినేని ధనుష్ శ్రీనివాస్ ( 30)కు హైదరాబాద్ , బెంగళూరులో వివిధ వ్యాపారాలు ఉన్నాయి. 2021 డిసెంబర్ లో తన సోదరుడు కార్తీక్ ద్వారా అలిశెట్టి అరవింద్ అనే వ్యక్తి శ్రీనివాస్ కు పరిచయం అయ్యాడు. కాకతీయ హిల్స్ కు చెందిన అలిశెట్టి అరవింద్, తాను బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా శ్రీనివాస్ తో చెప్పుకున్నాడు. పార్టీలో ముఖ్య నాయకులకు, మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడిగా పరిచయం చేసుకున్నాడు. పలు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫోటోలను శ్రీనివాస్ కు చూపించాడు. తనకున్న పరిచయాలతో పలుమార్లు ప్రభుత్వ ఆఫీసుకు శ్రీనివాస్ ను తీసుకెళ్లి మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించిన అధికారులను వ్యాపారి శ్రీనివాస్ కు పరిచయం చేసి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్ కి ప్రాజెక్టులో టెండర్ ఇప్పిస్తానని నమ్మించాడు. వీటితో పాటు రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను సప్లై చేసే బిజినెస్ కు అనుమతులు ఇప్పిస్తానని చెప్పాడు .ఈ క్రమంలో అనేకసార్లు శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. సంబంధించిన అధికారులతో మీటింగ్ పెట్టిస్తారని నమ్మించాడు. సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సంతకాలతో తయారు చేసిన ఫేక్ జీవోలను శ్రీనివాస్ కు చూపించాడు. 2022 ఫిబ్రవరి 16న రూ. 50 లక్షలు శ్రీనివాస్ దగ్గర నుంచి వసూలు చేశాడు.