‘గుంటూరు కారం’తో మాస్ ఘాటుని చూపించడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, ప్రచార చిత్రాలు మెప్పించడంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మిడ్ నైట్ షోలు, టికెట్ హైక్ లు కూడా తోడయ్యాయి.
తెలంగాణలో ‘గుంటూరు కారం’ చిత్రానికి మిడ్ నైట్ షోలకు, టికెట్ రేట్ హైక్ కి అనుమతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 23 థియేటర్లలో జనవరి 12న అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షోలు పడనున్నాయి. అలాగే మొదటి వారం రోజులు ఆరు షోలకి పర్మిషన్ వచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోలు ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా టికెట్ ధరలకి సంబంధించి సింగిల్ స్క్రీన్స్ లో రూ.65, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపుకు అనుమతి లభించింది.
అసలే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ క్రేజ్.. దానికితోడు స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించడంతో.. నైజాంలో మహేష్ బాబు రికార్డులు మడతపెడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.