తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు
టీడీపీ, జనసేన ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని సీఈవోకి ఫిర్యాదు చేశారని, ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓలు చెప్పాలి కానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారన్నారు. అసలు ఆ ఫిర్యాదు బోగస్ అన్నారు. తెలంగాణలో ఓట్లు కలిగిన వాళ్లకు ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని, ఇలాంటి డ్లూప్లికేట్ ఓట్లు తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీంతో దొంగ ఓటర్లను నియంత్రించవచ్చన్నారు. తెలంగాణ ఓటర్ లిస్టులో పేరు డిలీట్ చేశాకే ఏపీలో ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈసీని కోరామన్నారు. చంద్రబాబు, లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.