లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసి దాని ద్వారా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న లోకేష్ కనగరాజ్ తన సినిమాల లిస్ట్‌ని రోజురోజుకీ పెంచుకుంటూ పోతున్నాడు. సినిమాటిక్ యూనివర్స్ నుంచే కాకుండా వేరే కథలతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కూడా ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ అయిపోయాడు. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావాల్సి ఉన్న సినిమాల గురించి చెప్పాలంటే… ఖైదీ-2, విక్రమ్-2 రోలెక్స్ చిత్రాలను లైన్‌లోకి తేవాల్సిన అవసరం ఉంది. ఖైదీ2, విక్రమ్2 ఒకే యూనివర్స్‌కి చెందిన సినిమాలు. యూనివర్స్ కోసం క్రియేట్ చేసిన రోలెక్స్ క్యారెక్టర్స్‌తో యూనివర్స్‌కి సంబంధం లేకుండా మరో సినిమా చేయబోతున్నాడు.
వీటితోపాటు విజయ్‌తో లియో 2 కూడా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. లియో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా కథను కొనసాగిస్తూ మరింత ఆసక్తికరంగా రెండో భాగాన్ని తీర్చిదిద్దాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇది లియో రిలీజ్ అయినప్పటి నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా లియోకి కొనసాగింపుగా లియో2 కూడా ఉంటుందని లోకేష్ ప్రకటించాడు. లియోలో విజయ్‌ని ఓ రేంజ్‌లో చూపించిన లోకేష్ ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో అతని క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తాడు అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు 5 సినిమాలను డైరెక్ట్ చేసిన లోకేష్.. పది సినిమాలు చేసి రిటైర్ అవుతానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అతను చెయ్యాల్సిన సినిమాల లైనప్ చాలా పెద్దదిగానే ఉంది. ఇప్పటికే ఐదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదుగానీ, కేవలం పది సినిమాలతోనే రిటైర్‌మెంట్ తీసుకుంటానని లోకేష్ ప్రకటించడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అతని లైనప్ చూసిన తర్వాత ఇప్పట్లో లోకేష్ సినిమాలను వదిలే పరిస్థితి లేదనేది అర్థమవుతోంది.