Sankranti Cock Fight : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, రంగుల హరివిల్లులతో గ్రామగ్రామాన సంబరాలు కన్నుల పండుగగా జరుగుతాయి. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలకు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి మూడు రోజులు ఏపీలోని చాలా జిల్లాల్లో భారీగా కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ పందాల్లో వందల కోట్లు చేతులు మారతాయి. సంక్రాంతి రోజుల్లో నిర్వహించే పందాలకు ఏడాది ముందు నుంచే కోడి పుంజులను సిద్ధం చేస్తారు. గోదావరి జిల్లాల్లో రకరకాల పేర్లతో పిలిచే కోడిపుంజులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారు. బరిలో పోటీ పడే కోళ్లకు ప్రత్యేక ఆహారం కూడా పెడతారు. కోడి పందాల నిర్వహణ చట్టరీత్యా నేరమని పోలీసుల ప్రకటన, అనధికార అనుమతులు ఏటా జరిగే తంతులో భాగమే.