Mold Tek Packaging : ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్‌పూర్, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద రూ.100 కోట్లతో నూతన ప్లాంట్లు నెలకొల్పింది. నూతన కేంద్రాల మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు అని మోల్డ్ టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో కొత్తగా 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కంటైనర్ల తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం ఈ ప్లాంటు నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. 2024 అక్టోబర్ నాటికి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. 2024-25లో మోల్డ్‌టెక్ రూ.75-80 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.120 కోట్లు, 2022-23లో రూ.148 కోట్లు వెచ్చించిందన్నారు. కొత్త ప్లాంట్ల చేరికతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిమాణంలో 15-18 శాతం వృద్ధిని కంపెనీ ఆశిస్తోందన్నారు. 2023-24లో మోల్డ్ టెక్ క్లయింట్ల జాబితాలో పతంజలి, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా చేరాయన్నారు. తాజా విస్తరణతో 2024-25లో సంస్థ మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు.