Hyderabad Crime : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం తన కన్న తల్లినే హత్య చేశాడు ఓ కొడుకు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రామంతపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో కాసవేని సుగుణమ్మ (65) అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి గత కొన్నేళ్లుగా నివాసం ఉంటుంది. కొడుకు అనిల్ అధిక అప్పులు చేసి ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుగుణమ్మ పేరుపై ఉన్న ఇంటి కోసం తల్లితో తరుచూ గొడవపడేవాడు. కొడుకు వేధింపులు భరించలేక తల్లి సుగుణమ్మ ఐదేళ్ల క్రితమే ఇంటిని కోడలు తిరుమల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఈనెల 4న అర్ధరాత్రి సుగుణమ్మ ఇంట్లో నిద్రపోయింది. అదే రాత్రి కొడుకు అనిల్, కోడలు తిరుమల మరో వ్యక్తి ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశారు. సుగుణమ్మ నిద్రలో ఉండగానే ఆ ముగ్గురూ కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్టు మరుసటి రోజు బంధువులకు సమాచారం ఇచ్చారు. సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు కొడుకు, కోడలు.