Boinapally Vinod Kumar : ఫేక్ వార్తలతో బీజేపీ, కాంగ్రెస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…తనపై క్యూ న్యూస్ లో తీన్మార్ మల్లన్న అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన అన్న కూతురు బోయినపల్లి సరితకు అర్హత లేకపోయినా విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇచ్చారని వార్త ప్రసారం చేశారన్నారు. అసలు తనకు అన్నే లేరని, ఆ సరిత ఎవరో తెలియదన్నారు. ఇంటి పేరు కలిస్తే తనకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ ఫేక్ వార్తను బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అసలు తనకు అన్న అంటూ ఎవరు లేరన్నారు. క్రాస్ చెక్ చేసుకోకుండా వార్త ఎలా ప్రసారం చేస్తారని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి పరారైన నీరవ్ మోదీ ఇంటి పేరు మోదీ ఉంటే ప్రధాని మోదీకి సంబంధం ఉన్నట్లా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుష్ప్రచారం చేయించడం సరికాదన్నారు.