Praja Palana Programme in Telangana: డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజా పాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ పక్కా ప్రణాళిక ప్రకారం జరగాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన మంగళవారం హనుమకొండకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని అధికారులు, లీడర్లతో హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముందుగా హనుమకొండ జిల్లాకు సంబంధించిన అంశాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. శాంతిభద్రతలకు సంబంధించిన వివరాలను సీపీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించగా.. గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్ల వివరాలను మున్సికల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ఐక్యంగా, అంకితభావంతో ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించాలన్నారు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ముందుగానే అప్లికేషన్ ఫారాలు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించాలన్నారు.