Rajahmundry News : రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు…రకరకాల ఫుడ్ ఐటమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా టీ, కాఫీ, డ్రింక్స్, బిర్యానీ, సమోసాలు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ప్రయాణికులను ఉక్కిరిబిక్కి చేస్తుంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు మరో మార్గం లేక ఆ ఆహారాలు తింటుంటారు. ఈ ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండదని మరోసారి రుజువైంది. విశాఖ రైల్వేస్టేషన్ తోపాటు పలు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిన్న తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో పట్నా నుంచి తమిళనాడు సేలంకు వెళ్తున్న 15 మంది విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో బిర్యానీలు కొనుగోలు చేసి తిన్నారు. బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. రైలు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకోగానే అక్కడ సిద్ధంగా రైల్వే, పోలీసు సిబ్బంది ఆ ఐదుగురిని 108 వాహనంలో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు.