N Lingusamy On Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో ‘లియో‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోయినా కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎన్ లింగుస్వామి విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2006లో తన హిట్ మూవీ కథను వినకుండానే రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు.
కథ వినకుండానే నో చెప్పిన విజయ్
రీసెంట్ గా దర్శకుడు లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ తో ‘సండకోజి‘ కథ గురించి డిస్కస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కథను తొలుత జ్యోతికకు, ఆ తర్వాత విజయ్ కి చెప్పాలని భావించినట్లు వెల్లడించారు. “ఒకరోజు సమయం చూసుకుని విజయ్ కి కథ చెప్పడానికి వెళ్లాను. తన పాత్ర గురించి చెప్పాను. ఫస్ట్ భాగంలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో వివరించాను. అయితే, రెండో భాగం గురించి వినకుండానే ఆయన నో చెప్పారు. అంతేకాదు, ఈ స్ర్కిప్ట్ తనకు నచ్చలేదని, ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం లేదని చెప్పారు. కథ పూర్తిగా వినాలని నేను పట్టుబట్టినా తను అంగీకరించలేదు. వేరే కథ ఉంటే చెప్పాలన్నారు. నేను సెకెండ్ ఆఫ్ వినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాను” అని లింగుస్వామి వెల్లడించారు.
విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సండకోజి‘
విజయ్ తిరస్కరించిన కథతోనే వేరే హీరోతో సినిమా చేయాలని భావించినట్లు లింగుస్వామి తెలిపారు. కొద్ది రోజుల తర్వాత విశాల్ హీరోగా ‘సండకోజి‘ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. రాజ్ కిరణ్, లాల్. బాలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. విశాల్ కెరీర్ కు ఈ మూవీ మైల్ స్టోన్ గా నిలవడంతో పాటు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సండకోజి‘ నిలిచింది. 2009లో ఈ సినిమా కన్నడలో ‘వాయుపురా’ పేరుతో రీమేక్ చేయబడింది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
‘దళపతి 68’ షూటింగ్ లో విజయ్ ఫుల్ బిజీ
ప్రస్తుతం విజయ్ దళపతి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘దళపతి 68’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది(2024) జనవరి 1న టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, యోగి బాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.