- తాండూరు నడిబొడ్డున 14 ఎకరాల భూకంపం!
- సర్వే నంబర్ 111పై రెవెన్యూ బాంబు.. 107 ఇళ్లకు నోటీసులు
- ప్రభుత్వ భూములని తేల్చిన తహశీల్దార్ నివేదిక
- నల్లా, విద్యుత్ కనెక్షన్ల కట్ కు రంగం సిద్ధం
- హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 24న ప్రజాభిప్రాయ సేకరణ
- బిఆర్ఎస్ నాయకుల బ్లాక్మెయిల్ దందా అంటూ ఆరోపణలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భూములపై రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదిక ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. షాహుకార్ పేటలోని సర్వే నంబర్ 111లో గల 14 ఎకరాల 14 గుంటల భూమి ప్రభుత్వానిదేనని అధికారులు తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా అక్కడ నివాసముంటున్న 107 కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.హైకోర్టు ఆదేశాల మేరకు తహశీల్దార్ తారా సింగ్ పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. 1954-55 ఖాస్రా పహాణీ ప్రకారం ఈ భూమి ప్రభుత్వ గైరాన్’ భూమిగా రికార్డుల్లో ఉందని తెలిసింది. ఈ మేరకు తహశీల్దార్ జిల్లా కలెక్టరుకు సమగ్ర నివేదిక సమర్పించిన్నట్లు సమాచారం. ప్రభుత్వ భూమిలో వెలసిన 107 అక్రమ కట్టడాలకు మున్సిపల్ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ, వాటికి ఉన్న నల్లా మరియు విద్యుత్ కనెక్షన్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తుంది. సర్వేసెంబరు 111లో షాహుకార్పేట వీవీహెచ్ఎస్ పరిసరాలలో 14 ఎకరాల 14 గుంటల భూములు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో చాలాకాలంగా 107 మంది గృహనిర్మాణాలు చేపట్టారు. ఈ సర్వే నెంబరులో వి వి హెచ్ఎస్ ఆస్తులపై స్థానికులు,స్నేహితులైన గోపన్పల్లి షబ్బీర్, లొంక పాండు గతంలో డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించారు. ఇవి ప్రభుత్వ భూములైనందున నిర్మాణాలకు మున్సిపాలిటీ ఎలా అనుమతులు ఇచ్చిందని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 111 సర్వేసెంబరు భూములపై తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ భూములపై ఏప్రిల్ 24 లోగా కలెక్టర్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ భూవివాదం వెనుక కొంతమంది రాజకీయ నాయకుల బ్లాక్‌మెయిలింగ్ దందా ఉన్నట్లు బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గత పదేళ్లుగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ సర్వే నంబర్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవాలంటే స్థానిక నివాసులు 50 లక్షల రూపాయలు చెల్లించాలని మధ్యవర్తుల ద్వారా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఇంటి యజమాని రూ. 50 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో కోర్టు ద్వారా ఇళ్లను కూల్చివేయిస్తామని బెదిరిస్తున్నట్లు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.నూతన కౌన్సిలర్ లు హఠాత్తుగా ఈ భూవివాదంలో తలదూర్చడం వెనుక ఓ నాయకుడి హస్తం ఉందని స్థానికులు మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల ఏప్రిల్ 24న కలెక్టర్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు సమాచారం. ఒకవైపు అధికారుల నోటీసులు, మరోవైపు రాజకీయ నాయకుల వేధింపులతో 107 కుటుంబాల యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దశాబ్దాల క్రితం మున్సిపాలిటీ అనుమతితోనే ఇళ్లు కట్టుకున్నాం, ఇప్పుడు రోడ్డున పడేయడం న్యాయమేనా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.



