హైవే ముసుగులో ‘ఎర్ర’ దందా..!

- అర్ధరాత్రి అక్రమ ‘మట్టి’ మాయ!
- అభివృద్ధి పేరుతో దోపిడీ.. ఆదివారం కూడా ఆగని అక్రమ రవాణా
- రాజకీయ నేతకు ‘కప్పం’..
- కళ్లు మూసుకున్న యంత్రాంగం
తాండూరు జానవాహిని ప్రతినిధి :- వికారాబాద్ జిల్లా తాండూరు, యాలల మండలాల్లో “నేషనల్ హైవే” నిర్మాణం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అభివృద్ధి ముసుగులో సహజ సంపద అయిన ఎర్ర మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. పగలు ప్రభుత్వ పనులంటూ హడావుడి చేస్తున్న కాంట్రాక్టర్లు.. రాత్రిళ్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు మట్టిని అమ్ముకుంటూ సోమ్ము చేసుకుంటున్నారు.
ఎంఎంఆర్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
తాండూరు మండలంలోని ఖంజాపూర్, యాలల మండలంలోని దౌలపూర్ శివారులో ఎర్ర మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎంఎంఆర్ కాంట్రాక్టర్ కు చెందిన వాహనాలు సెలవు దినం అనే తేడా లేకుండా, ఆదివారం కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నాయి. అర్ధరాత్రి దాటితే చాలు.. టిప్పర్లన్నీ ప్రైవేటు డంపింగ్ యార్డులకు క్యూ కడుతున్నాయి.ప్రభుత్వ అనుమతితో హైవే కోసం తీస్తున్న మట్టిని, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఓ ప్రైవేట్ స్థలంలో డంప్ చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు, సదరు నాయకుడికి మట్టిని అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం.కళ్ళ ముందే వందల లారీల మట్టి మాయమవుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సెలవు రోజుల్లో అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ ‘ఎర్ర’ దోపిడీపై విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



