శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ రూట్ మార్చ్

- తాండూర్ సబ్ డివిజన్లో ముమ్మరం
- ఎన్నికల నేపథ్యంలో భద్రత పెంపు
- శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
- డీఎస్పీ, సీఐ పర్యవేక్షణలో రూట్ మార్చ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో విశ్వాసం పెంపొందించడానికి మరియు ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛా న్యాయంగా జరిగేలా చూడడానికి వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు రూట్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు, తాండూర్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పర్యవేక్షణలో ఈ రూట్ మార్చ్ జరిపారు. ఈ రూట్ మార్చ్‌లో తాండూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి , పెద్దేముల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు. లా & ఆర్డర్ సిబ్బందితో పాటు, ప్రత్యేక బృందాలైన క్విక్ రియాక్షన్ టీం, ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శక్తిని ప్రదర్శించారు. పెద్దేముల్, గాజీపూర్ గ్రామాలలో ఈ రూట్ మార్చ్ నిర్వహించబడింది. ప్రధానంగా, ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజల్లో భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ,.. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.



