
- తాండూరు మున్సిపల్ పోరులో సైలెన్స్..
- నేతల్లో ‘మౌనం’.. మాజీల్లో ‘జంకు’..!
- ఆసక్తి చూపని అభ్యర్థులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం దగ్గరపడుతున్నా, తాండూరు రాజకీయాల్లో మాత్రం ఆశించిన వేడి కనిపించడం లేదు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో, నియోజకవర్గ కేంద్రమైన తాండూరు మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంది. ఒకవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే, మరోవైపు గెలుపు గుర్రాలుగా భావించే నేతలు మాత్రం ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు.సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ ఊహాగానాలు రాగానే వార్డుల్లో సందడి మొదలవుతుంది. కానీ ప్రస్తుతం తాండూరులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల్లోనూ ఎన్నికల జోరు నామమాత్రంగానే ఉంది.గత ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచిన మాజీలు ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ‘ఖర్చు’ మరియు ‘ప్రజా వ్యతిరేకత’ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితిపై ప్రజల్లో వెతిరేకత ఏర్పాడుతుందని భావిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా, కౌన్సిల్‌లో పట్టు సాధించడం కష్టమని కొందరు మాజీలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో వార్డులో గెలవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అంత రిస్క్ తీసుకోవడానికి నేతలు సిద్ధంగా లేరు.పట్టణంలోని సమస్యలు అలాగే ఉండటం, మరోవైపు యువ ఓటర్ల సంఖ్య పెరగడం పాత నేతలకు సవాల్‌గా మారింది.వార్డుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో తెలియకపోవడం కూడా నేతల మౌనానికి ఒక కారణం.మరో పది రోజుల్లో ఓటర్ల జాబితా ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాతైనా తాండూరు గల్లీల్లో ఎన్నికల సందడి మొదలవుతుందో లేదో చూడాలి.



