రాజీవ్ కాలనీలో కత్తిపోట్లు..!

- తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు
- ప్రాణభయంతో షాపులోకి దూరిన వ్యక్తి
- అడ్డుకున్న యజమానిపై కత్తితో విచక్షణారహిత దాడి!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ కాలనీలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ, సంబంధం లేని షాపు యజమాని మరియు అతని కుమారుడిపై ప్రాణాంతక దాడికి దారితీసింది.స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు మండలం ఖంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి, ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టు అనే వ్యక్తికి మధ్య పాత కక్షలు లేదా ఇతర కారణాలతో గొడవ జరిగింది. ఈ క్రమంలో గోపాల్ కత్తితో కిట్టును వెంబడించాడు. ప్రాణ భయంతో కిట్టు పరుగెత్తుకుంటూ వెళ్లి రాజీవ్ కాలనీలోని నూర్ అహ్మద్‌కు చెందిన చికెన్ షాపులోకి దూరి, లోపలి నుంచి షట్టర్ వేసుకున్నాడు.
షాపు బయట ఉన్న యజమాని నూర్ అహ్మద్, అతని కుమారుడు అబ్దుల్.. గోపాల్‌ను ఎందుకు గొడవ పడుతున్నావని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన గోపాల్, తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా తండ్రీకొడుకులపై దాడికి దిగాడు. ఈ దాడిలో నూర్ అహ్మద్ మరియు అబ్దుల్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.రక్తపు మడుగులో ఉన్న బాధితులను గమనించిన స్థానికులు వెంటనే వారిని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు గోపాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.




