- వారసత్వపు ‘బంటు’ రాజకీయం..
- అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు!
- కాలం మారింది.. కానీ కండువా మారలేదు,
- ఆ కుటుంబం పై ప్రజల నమ్మకం తగ్గలేదు!
- 1995లో ‘రాములు’.. 2026లో ‘వేణు’.. సాయిపూర్ 11వ వార్డులో మళ్ళీ కాంగ్రెస్ విజయకేతనం!
జనవాహిని ప్రతినిధి తాండూరు : కొన్ని విజయాలు కేవలం ఓట్లకు సంబంధించినవి మాత్రమే కాదు, అవి భావోద్వేగాలకు సంబంధించినవి. 1995లో సాయిపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి, కౌన్సిలర్‌గా ప్రజల మనసు గెలుచుకున్న బంటు రాములు వారసత్వం మళ్ళీ 2026లో ప్రాణం పోసుకుంది. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత, అదే నిబద్ధతతో ఆయన తనయుడు బంటు వేణు 11వ వార్డు కౌన్సిలర్‌గా ప్రభంజనం సృష్టించారు.రాజకీయాల్లో రంగులు మార్చే వారున్న ఈ రోజుల్లో.. మూడు దశాబ్దాలుగా ఒకే జెండా, ఒకే ఎజెండాతో ప్రజల గుండెల్లో కొలువుదీరిన అరుదైన దృశ్యం సాయిపూర్ 11వ వార్డులో ఆవిష్కృతమైంది. సరిగ్గా 31 ఏళ్ల క్రితం తండ్రి వేసిన అడుగులో.. నేడు తనయుడు అడుగు వేసి, ఆ వారసత్వపు పరంపరను ఘనంగా చాటారు.అప్పట్లో సాయిపూర్ రాజకీయాల్లో బంటు రాములు ఒక సంచలనం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, సామాన్యుల మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన, 1995లో సాయిపూర్ లోని 9,10,11,12 వార్డ్ లు కలిపి ఒకే వార్డ్ గా ఉండేవి వాటికీ బంటు రాములు కౌన్సిలర్‌గా గెలిచి వార్డు అభివృద్ధికి బాటలు వేశారు. అప్పట్లో ఆయన సంపాదించుకున్న ఆ “ప్రజాభిమానమే” నేడు ఆయన కుమారుడికి శ్రీరామరక్షగా నిలిచింది.తండ్రి బాటలోనే నడుస్తూ, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగిన బంటు వేణు, నేడు జరిగిన ఎన్నికల్లో 11వ వార్డు కౌన్సిలర్‌గా బరిలోకి దిగారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, ఏకంగా 909 ఓట్ల భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు.పదవులు వస్తాయి.. పోతాయి. కానీ మా తండ్రి మాకు నేర్పిన రాజకీయ సంస్కారం ‘ప్రజలకు సేవ చేయడం’. ఈ విజయాన్ని నా తండ్రి బంటు రాములుకు అంకితం చేస్తున్నాను. మా కుటుంబంపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకూ నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు హామీ ఇచ్చారు.



