- జంగిల్ పాలన మీది…! చర్చకు సిద్ధమా?
- మహిళా ఛైర్పర్సన్‌ను అగౌరవపరిచిన చరిత్ర మీది
- 36కు 36 వార్డుల్లో గెలిచి తీరుతాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత మున్సిపల్ పాలనలో తాండూరు పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా, అరాచకమైన, ‘జంగిల్ వ్యవస్థ’గా మారిపోయిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పట్టణ ప్రయోజనాలను విస్మరించి, కేవలం పదవుల కోసం పాకులాడారని బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.మున్సిపల్ కార్యాలయాన్ని బిఆర్ఎస్ నాయకులు గ్రూపు రాజకీయాలకు అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో కుర్చీల కోసం కొట్లాడుకున్న గతి మీదన్నారు. కనీసం ఒక మహిళా ఛైర్పర్సన్‌ను కూడా గౌరవించలేని సంస్కృతి మీ పార్టీది అని ఆయన దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల వల్ల తాండూరు అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తాండూరు ప్రజలకు ఎవరు ఏం చేశారో స్పష్టంగా తెలుసన్న ఎమ్మెల్యే, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.మీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఎంత? నా రెండేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత? చర్చకు నేను సిద్ధం. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు.ఈ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీలో కొత్త చరిత్ర సృష్టిస్తామని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న 15 రోజుల్లో తాండూరులోని మొత్తం 36 వార్డుల్లో విజయం సాధించి, మున్సిపాలిటీపై పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలను గ్రహించారని, అబద్ధపు ప్రచారాలను నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.






