
- తాండూరు మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా రగడ
- అధికారుల తీరుపై 1వ వార్డు అభ్యర్థి సిరి యాదవ్ ‘నిప్పులు’
- లింక్‌లో 1వ వార్డు ఓటర్ల లిస్ట్ మాయం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం
- మా వార్డు లిస్ట్ ఏది..? ఓటర్లకు ఏం సమాధానం చెప్పాలి..?” – సిరి యాదవ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిరి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా లింక్‌లో 1వ వార్డు వివరాలు కనిపించకపోవడంపై ఆయన అధికారులను సూటిగా నిలదీశారు. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే, కేవలం మొదటి వార్డు జాబితానే ఎందుకు మాయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓటర్ల జాబితాను ఇంత ఆలస్యంగా ఇస్తే, అభ్యర్థులుగా మేం ఆ జాబితాను ఎప్పుడు పరిశీలించాలి? వార్డులో ఎన్ని కొత్త ఓట్లు పెరిగాయి? ఎన్ని తొలగించారు? అనేది మాకు ఎలా తెలుస్తుంది? అని సిరి యాదవ్ నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అభ్యర్థులు, ఓటర్లు తికమక పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో ఒక వార్డునే మాయం చేయడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, దీనివల్ల 1వ వార్డు ప్రజలు తమ ఓటు హక్కుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తక్షణమే సాంకేతిక సమస్యలను సరిచేసి, 1వ వార్డు పూర్తి స్థాయి ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.



