- ఎన్నికల వేళ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
- తాండూరు డీఎస్పీ కౌన్సిలింగ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో అశాంతిని కలిగించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వర్తించే సమయంలో వారికి ఆటంకం కలిగించినా, దుర్భాషలాడినా చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ గూడూరి సంతోష్ కుమార్, ఎస్ఐలు పుష్పలత, సాజిద్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






