- మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- నాణ్యమైన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ ప్రారంభం
- మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళల ఆర్థికాభివృద్ధికి కొండంత భరోసా కల్పిస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మెఫ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రతి పథకంలోనూ మహిళలకే ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని మహిళా సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల నిధులు అందించామని గుర్తుచేశారు. మహిళలను కేవలం గృహిణులుగా కాకుండా, వారిని స్వశక్తితో ఎదిగే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గతంలో మాదిరిగా కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం అత్యంత నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని మహిళలందరికీ ఉగాది పండుగ నాటికి పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ అభివృద్ధిలో ఆర్.పీల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.ప్రభుత్వంపై కొంతమంది కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాలను మహిళలు ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. మహిళలను మహారాణులుగా చూడటమే రేవంతన్న ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెఫ్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






