బైక్ గొడవతో మనస్థాపం…!

- యువకుడి ఆత్మహత్య
- యాలాల మండలంలో విషాదం..
- అగ్గనూరులో ఘటన
తాండూరు : బైక్ విషయంలో జరిగిన గొడవ, ఆపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, యాలాల మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలోని అగ్గనూరు గ్రామానికి చెందిన సమీర్ ఖాన్, అదే గ్రామానికి చెందిన అరుణ్ గౌడ్ మధ్య శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో గ్రామం వెలుపల ఉన్న నాగుల కుంట వద్ద ఘర్షణ జరిగింది. ఈ గొడవ సమయంలో సమీర్ ఖాన్ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని అరుణ్ గౌడ్ తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనతో సమీర్ ఖాన్ తీవ్ర అవమానానికి గురయ్యాడు. జరిగిన సంఘటనను తలుచుకుంటూ శనివారం రాత్రి నుంచి తీవ్ర మనస్థాపంతో బాధపడ్డాడు.ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, సమీర్ ఖాన్ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత మృతుని తల్లి, చిన్నాన్న ఇంటికి చేరుకోగా, సమీర్ ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించారు.వెంటనే అతడిని కిందకు దించి, చికిత్స నిమిత్తం హుటాహుటిన తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సమీర్ ఖాన్ మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు.మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బైక్ గొడవ, తదనంతర పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చిన్న గొడవ కారణంగా యువకుడు ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



