- తాండూరు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులపై వేధింపులు
- ఫీజుల కోసం హాల్ టికెట్లు ఆపివేత.. పరీక్షలకు అనుమతించని వైనం
- పిల్లలను భయపెడుతున్న యాజమాన్యాలు.. ఆందోళనలో తల్లిదండ్రులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన సరస్వతీ నిలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఫీజుల వసూళ్లే లక్ష్యంగా తాండూరులోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాయి. అకడమిక్ ఇయర్ ముగుస్తుండటంతో, ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులపై స్కూల్ యాజమాన్యాలు ‘ఫీజు’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి.వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో కొన్ని పాఠశాలలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఫీజు బకాయి ఉన్న విద్యార్థులను తరగతి గదుల నుండి బయటకు పంపడం, అందరి ముందు నిలబెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. “ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వం.. పరీక్షలు రాయనివ్వం” అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నాయి. దీంతో అభం శుభం తెలియని విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.ఫీజు కట్టని పక్షంలో పిల్లలను ఫెయిల్ చేస్తామని, వచ్చే ఏడాది మళ్ళీ అదే క్లాసులో ఉంచుతామని యాజమాన్యాలు బెదిరింపులకు దిగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా, పిల్లలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనని వారు లోలోపలే కుమిలిపోతున్నారు.విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఏ విద్యార్థిని కూడా ఫీజుల పేరుతో మానసిక క్షోభకు గురిచేయకూడదు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం, ఏ విద్యార్థిని కూడా శారీరక శిక్షకు లేదా మానసిక వేధింపులకు గురిచేయకూడదు. ఫీజు కట్టలేదని పిల్లలను అందరిముందు బయట నిలబెట్టడం, తరగతిలోకి అనుమతించకపోవడం లేదా అవమానించడం మానసిక వేధింపుల కిందకు వస్తుంది. ఇది నేరం.ఫీజు వివాదం అనేది తల్లిదండ్రులకు మరియు పాఠశాల యాజమాన్యానికి మధ్య ఉన్న అంశం. దీనికి విద్యార్థిని బాధ్యుడిని చేస్తూ వారి విద్యా సంవత్సరానికి ఆటంకం కలిగించే హక్కు పాఠశాలకు లేదు. సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టులు కూడా “ఫీజు కట్టలేదన్న కారణంతో విద్యార్థులను పరీక్షలకు కూర్చోనివ్వకపోవడం లేదా చదువుకు దూరం చేయడం తగదు” అని స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి.అయితే ముఖ్యంగా పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఆపివేయడం చట్టవిరుద్ధం. కానీ, తాండూరులో మాత్రం ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని, ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ ఫీజుల దందాపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, విద్యార్థులను వేధిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



