Monday, February 16, 2026
Home NEWS పోలీసులతో మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ దిగ్బంధం!

పోలీసులతో మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ దిగ్బంధం!

0
553
  • తాండూరులో రాజకీయ ప్రకంపనలు.
  • అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడులు!
  • మణికొండలో హైటెన్షన్.. రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం
  • మున్సిపల్ ఎన్నికల వివాదమే కారణమా? 
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంపై పోలీసుల సోదాలకు దారితీసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసాన్ని సుమారు 50 మంది తాండూర్, వికారాబాద్ పోలీసులు చుట్టుముట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రాత్రి సమయంలో భారీగా మోహరించిన పోలీసులు రోహిత్ రెడ్డి ఇంటి లోపలికి ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎవరూ బయటి వ్యక్తులతో సంప్రదించకుండా ఆంక్షలు విధించారు. రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మణికొండకు చేరుకుంటున్నారు.ఫిబ్రవరి 13న జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు రోహిత్ రెడ్డి సహా ఎనిమిది మంది బీఆర్ఎస్ నేతలపై FIR No. 50/2026 నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే అర్ధరాత్రి సోదాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, తాండూరులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి పంజుగుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అనుచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారని, ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన తమ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని వారు మండిపడ్డారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దారా సింగ్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్, వికారాబాద్ కలెక్టర్‌కు ఫిర్యాదులు పంపింది.ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసుల తనిఖీలు కొనసాగుతుండటంతో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here