పల్లె పోరు పగ చల్లారలేదు…!

- ఓడించారాని ఇందిరమ్మ ఇంటి బిల్లులు నిలిపివేస్తున్న ఇంటి దొంగలు
- పర్యవేక్షనకు వస్తున్నా హౌసింగ్ కమిటీ అధికారులకు బెదిరింపులు
- ఇందిరమ్మ కమిటీల ‘అతి’.. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!
- బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఉన్న చోట వివక్ష..
- తాండూరులో రాజకీయ వేధింపులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో రాజకీయ రంగు పులుముకుంది. అర్హులైన లబ్ధిదారులకు అండగా ఉండాల్సిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణా బిల్లులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో ఈ కమిటీల జోక్యం మితిమీరిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారన్న సాకుతో, కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల మంజూరును, బిల్లుల చెల్లింపును నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తున్న హౌసింగ్ అధికారులను సైతం కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని, వారిని బెదిరింపులకు గురిచేస్తూ గ్రామాల్లోకి రానివ్వడం లేదని స్థానికులు వాపోతున్నారు.ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచ్‌లకు వ్యతిరేకంగా ఇందిరమ్మ కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయని బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇందిరమ్మ బిల్లు నిలిపివేతలో ఇంటి దొంగలే సూత్రదారి గా వ్యవహారిస్తున్నారు. బషీరాబాద్ మండలంలో జరుగుతున్న దౌర్జన్యం పై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.






