పచ్చని పందిరిలోనే పాడె కట్టారు..!

- తలంబ్రాలు పోయాల్సిన చేతులే కన్నీళ్లు తుడిచాయి!పెళ్లింట చావు డప్పు..
- పెళ్లికి వచ్చిన వారంతా స్మశానానికి
- సంగెంకుర్డ్‌లో కన్నీటి సంద్రం.
తాండూరు :- మరి కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. బంధుమిత్రుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారాలి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆనందం ఆవిరైంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు, తండ్రి శవం ముందు గుండెలు పగిలేలా రోదించడం చూసి యాలల మండలం సంగెంకుర్డ్ గ్రామం కంటతడి పెట్టింది.కూతురి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్న తండ్రి అనంతప్ప, ఆ పెళ్లి వేడుకను చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి రోజే జరిగిన రోడ్డు ప్రమాదం అనంతప్ప ప్రాణాలను బలిగొంది. దీంతో పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే, తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి రావడం అందరినీ కలచివేసింది. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు, కన్నీళ్లతో స్మశానానికి పయనమయ్యారు. శుభలేఖలు పంచిన చేతులతోనే, కూతురు తండ్రికి వీడ్కోలు పలకడం ఆ దేవుడికే అన్యాయం అనిపించలేదేమో!
వివరాల్లోకి వెళ్తే….వికారాబాద్ జిల్లా యాలల మండలం సంగెంకుర్డ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురి వివాహం జరగాల్సిన రోజే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, పెళ్లి పందిరి కాస్తా విషాద వేదికగా మారింది.గ్రామానికి చెందిన అనంతప్ప తన కూతురి వివాహం నిశ్చయించి, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, పెళ్లి ముహూర్తానికి ముందే పెళ్లి పనుల కోసం మండల కేంద్రానికి వెళ్లి వచ్చే క్రమం లో బైక్ అదుపుతప్పి కిందపడిన అనంతప్ప తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి రిఫర్ చేశారా వైద్యులు. చికిత్స పొందుతూనే అనంతప్ప మృతి చెందాడు. మంగళ వాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లికి అతిథులుగా వచ్చిన వారంతా, అనంతప్ప అంతిమ యాత్రలో పాల్గొనాల్సి వస్తుంది. పెళ్లి కోసం వేసిన షామ్యానా కిందే తండ్రి మృతదేహాన్ని ఉంచి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.



