పంచాయితీపై ఫైట్…!

- గాజీపూర్ పంచాయతీ ఎన్నికల రచ్చ..!
- కలెక్టరేట్ మెట్లెక్కిన సర్పంచ్ అభ్యర్థి
- ఆర్ఓ తిరుపై నిప్పులు
- విచారణకు డిమాండ్!
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇటీవల తాండూరు నియోజకవర్గం లో ఉత్కంఠభరితంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గాజీపూర్‌లో పెను వివాదానికి దారితీశాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను కొందరు అధికారులు అపహాస్యం చేశారని, ఎన్నికల ఫలితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సర్పంచ్ అభ్యర్థి తలారి సుశీల భర్త తలారి వీరప్ప బుధవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గాజీపూర్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరుపై వీరప్ప తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరించి, నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసేలా జరిగిన ఈ అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.ఎన్నికల్లో జరిగిన అన్యాయంపై ఆధారాలతో సహా త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు.ప్రజల తీర్పును తారుమారు చేసిన శక్తులపై న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తిరిగి సమీక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి పునాదులు. అలాంటి ఎన్నికల్లోనే అక్రమాలకు పాల్పడితే ఇక సామాన్యులకు దిక్కెవరంటు ఆర్ఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్ఓ పై విచారణ జరిపించాల్సిందే అని తలారి వీరప్ప డిమాండ్ చేశారు. ఈ విషయం పై గాజీపూర్ గ్రామ రాజకీయాల్లో హీట్ పెంచింది. దింతో జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదుపై స్పందించి విచారణకు ఆదేశిస్తారా? లేదా బాధితులు కోర్టు ద్వారానే న్యాయం పొందుతారా? అనేది ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.



