- ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..!
- పారదర్శకమైన పాలనతోనే అభివృద్ధి సాధ్యం
- ఆదర్శ గ్రామాలు, పట్టణాల తీర్చిదిద్దడమే లక్షంగా పని చెయ్యాలి
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజా ప్రతినిధులు ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించాల్సిన అవసరం ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలీకార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మరియు సర్పంచులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ, తమ పరిధిలోని గ్రామాలు మరియు పట్టణాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి చేరవేసేలా ప్రజా ప్రతినిధులు వారధిలా పనిచేయాలన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శిక్షణ పొందిన ప్రజా ప్రతినిధులు తమ పరిధిలో మెరుగైన సేవలందించాలని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.






