Wednesday, February 4, 2026

    దోస్తీ కుదిరేనా…? రెబల్స్ దిగేనా…?

    0
    91
    • నేడే నామినేషన్ల ఉపసంహరణ
    • నేటితో తేలనున్న అభ్యర్థుల జాతకం.. మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు
    • రెబల్స్ బెడదపై పార్టీల బుజ్జగింపులు.. ఉత్కంఠలో 36 వార్డుల ఓటర్లు

    జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. నేడు మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో బరిలో నిలిచేది ఎవరు? వెనక్కి తగ్గేది ఎవరు? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉండగా, ఆ తర్వాత అధికారులు అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు గాను ప్రస్తుతం 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీల తరపున బి-ఫారమ్ పొందిన అభ్యర్థుల కంటే, టికెట్ ఆశించి భంగపడ్డ రెబల్ అభ్యర్థులే ఇప్పుడు ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మేము తక్కువ కాదు అన్నట్లుగా రెబల్స్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండటంతో గెలుపోటములపై సమీకరణాలు మారుతున్నాయి.గత రెండు రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, జిల్లా స్థాయి, నియోజకవర్గం, పట్టణ నాయకులు రంగంలోకి దిగి రెబల్ అభ్యర్థులను దారికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవుల ఆశ చూపినా, భవిష్యత్తు హామీలు ఇచ్చినా కొందరు అభ్యర్థులు ససేమిరా అంటున్నారు. పలు వార్డుల్లో బడా నాయకుల రాయబారాలు ఫలించలేదని, రెబల్స్ పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయి అసలు అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.నేటితో ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండటంతో, బుధవారం నుండి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఏ అభ్యర్థి ఏ పార్టీకి మద్దతు ఇస్తారో, ఎవరు పార్టీ ఫిరాయిస్తారో అన్న చర్చ గల్లీల్లో జోరుగా సాగుతోంది. రెబల్స్ దెబ్బ ఎవరికి తగులుతుంది? ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుంది? అనేది వేచి చూడాలి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here