దాతలెవరో..? అనుభవించదెవరు…?

- అనుమతులు లేవు.. ఆరోపణలు అనేకం!
- భద్రేశ్వరుని సాక్షిగా ‘షాపింగ్’ దందా?
- మున్సిపల్ పర్మిషన్ లేదు.. కానీ అంతస్తుల మీద అంతస్తులు – ఎండోమెంట్ శాఖ ఏం చేస్తోంది?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ ఆరాధ్య దైవం భద్రేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. భక్తుల సౌకర్యార్థం వినియోగించాల్సిన దేవాలయ స్థలాన్ని కొందరు స్వార్థపరులు కమర్షియల్ అడ్డాగా మారుస్తున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఎండోమెంట్ శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా, దాతల సహకారంతో జరిగే నిర్మాణాలపై పారదర్శకత కరువైందని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.
దాతలెవరు? డబ్బాలు ఎవరి జేబుల్లోకి?
సాధారణంగా దేవాలయాల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టి ఎండోమెంట్ శాఖకు అప్పగించాలి. కానీ, భద్రేశ్వర ఆలయ వద్ద జరుగుతున్న నిర్మాణాలకు అసలు దాతలు ఎవరనేది మిస్టరీగా మారింది. స్థానిక దుకాణదారుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఈ షాపులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వసూళ్లు ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయి? దేవాలయ ఖజానాకు చేరుతున్న లాభమెంత?
మున్సిపల్ అనుమతులు గాలికే..
ఏదైనా భారీ నిర్మాణం చేపట్టాలంటే మున్సిపల్ శాఖ నుండి పక్కా అనుమతులు ఉండాలి. కానీ, ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మాణాలు సాగుతున్నాయని, ఇప్పటికే మొదటి అంతస్తు పనులు కూడా ప్రారంభమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి జరుగుతున్న ఈ నిర్మాణాలపై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు.
భక్తులకు కష్టాలు.. వ్యాపారులకు లాభాలు..
దేవాలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, అర్చకులకు వసతులు ఏర్పాటు చేయడంలో, సత్రాల నిర్మాణంలో విఫలమైన కమిటీ.. కేవలం కమర్షియల్ దుకాణాలకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? దేవాలయ సామాగ్రి భద్రపరచడానికి కూడా చోటు లేకుండా పోతుంటే, లాభార్జనే ధ్యేయంగా నిర్మాణాలు చేపట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే విచారణ జరిపించాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేసి దేవాలయ పవిత్రతను కాపాడాలని తాండూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



