తాండూరులో హై అలర్ట్….!

- దాడి ఘటనలో ఒకరి మృతి, పోలీసుల భారీ బందోబస్తు.
- పాత కక్షల సెగ: అడ్డువచ్చిన వారిపై కత్తులతో విరుచుకపడ్డ దుండగులు.
- ముందస్తు పథకం ప్రకారమే అటాక్?
- తాండూరులో ఉద్రిక్తత, రంగంలోకి దిగిన డీఐజీ, ఎస్పీ.
జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల కేంద్రంలోని రాజీవ్ కాలనీలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని వెంబడిస్తూ వచ్చిన దుండగులు, బీఫ్ షాపు యజమాని మరియు అతని తండ్రిపై విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడ్డారు.స్థానిక ఇందిరమ్మ కాలనీ కి చెందిన అబ్దుల్ సఫియాన్ మరియు అతని తండ్రి నూర్ అహ్మద్ తమ బీఫ్ షాపులో ఉండగా, అదే కాలనీకి చెందిన కిట్టు అనే వ్యక్తిని గోపాల్, ఆదర్శ్, అనిల్, ప్రవీణ్ కుమార్, కృష్ణ ప్రశాంత్, చందు అనే ఆరుగురు వ్యక్తులు కొడుతూ వెంబడించారు. ప్రాణ భయంతో కిట్టు సుఫియాన్ షాపులోకి వచ్చి తలదాచుకున్నాడు.ఈ క్రమంలో షాపు వద్దకు చేరుకున్న నిందితులు గొడవ చేస్తుండగా, సఫియాన్ తండ్రి నూర్ అహ్మద్ (60) వాదించడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన గోపాల్ అనే వ్యక్తి తన వద్దనున్న పదునైన కత్తితో నూర్ అహ్మద్ కడుపులో పొడిచాడు. తండ్రిని కాపాడేందుకు వెళ్లిన సుఫియాన్ చాతిపై, చేతిపై కూడా కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. వీరిని అడ్డుకోవడానికి వచ్చిన మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
ముందస్తు పథకం ప్రకారమే దాడి?
నిందితులు ముందస్తు పథకం ప్రకారమే ఆయుధాలతో వచ్చి ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నూర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉండడం తో హైదరాబాద్ కు రెఫెర్ చేశారు. మార్గ మధ్యలోనే నూర్ అహ్మద్ మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుడు అబ్దుల్ సఫియాన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన తో తాండూరు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారీ బందోబస్తూ మధ్య తాండూరు ను పోలీసులు చుట్టూముట్టారు. తెలంగాణ జోగులాంబ జోన్ డిఐజి ఎల్ఎస్ చౌహన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర పర్యవేక్షణలో ఎలాంటి అల్లర్లు జరగకుండా తాండూరు లో భారీ బందోబస్తూ ఏర్పాటు చేశారు. తాండూరు లో జరిగిన ఘటనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.





