తాండూరులో రౌడీయిజానికి కాంగ్రెస్ తెర..!

- కాంగ్రెస్ అరాచక పాలనపై బీఆర్ఎస్ ఎన్నికల సమరం!
- 420 హామీలతో మోసం చేశారంటూ ధ్వజం
- రౌడీయిజం, ఇందిరమ్మ ఇండ్లు ఎన్నికల గారడీ’
- కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు రోహిత్ రెడ్డి పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల తీరుపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్, మల్కన్ గిరి, నవల్గా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.తాండూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగా రౌడీయిజం, గుండాయిజం సంస్కృతికి తెర లేపారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. తమకు అడ్డు వచ్చే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ లో భాగమే అని, గ్రామానికి ఒకటి, రెండు ఇండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ గారడిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.

అదేవిదంగా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. ఇప్పుడు ఆ హామీల ఊసేత్తకుండా ప్రజలను మోసం చేసిందని పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పేద ప్రజల బాగు కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం పాతాళానికి నెట్టేసిందని మండిపడ్డారు.గ్రామాల్లో కరెంటు లేక, సమయానికి మంచినీటి సరఫరా కాక ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ సమస్యలపై నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



