- ముదురుతున్న టికెట్ల టెన్షన్!
- రేపే నామినేషన్లు.. ఇంకా తేలని అభ్యర్థుల జాబితా
- బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ.. ‘వేచి చూసే’ ధోరణిలో పార్టీలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా పెరిగాయి. రేపటి నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అటు పార్టీలకు, ఇటు ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.తాండూరు లో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండటంతో గెలుపు గుర్రాల వేట ఉత్కంఠగా మారింది.ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు కనిపిస్తోంది. అయితే, ఏ పార్టీ కూడా అభ్యర్థులను ముందుగా ప్రకటించే సాహసం చేయడం లేదు. ప్రత్యర్థి పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు ‘ఒకరి కోసం ఒకరు’ అన్నట్లుగా వేచి చూస్తున్నారు. బిఆర్ఎస్ జాబితా కోసం కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థుల కోసం బిఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తుండటం గమనార్హం. కాగా, బీజేపీకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో తన పట్టును మరింత పెంచుకునేందుకు ఎంఐఎం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీట్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇకపోతే, ఈసారి కౌన్సిలర్ బరిలో సీనియర్ నాయకులు సైతం నిలబడాలని నిర్ణయించుకోవడంతో సమీకరణాలు మారుతున్నాయి.నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండటం, ప్రచారానికి కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పతాక స్థాయికి చేరింది. టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియక ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేపటి లోగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది.






