జీవోలో పొరపాటు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం

- ఉప సర్పంచుల చెక్ పవర్…!
- వివాదం నుంచి వివరణ వరకు.. అసలేం జరిగింది?
- ఉప సర్పంచుల చెక్ పవర్‌పై క్లారిటీ వచ్చేసింది
జనవాహిని ప్రతినిధి : తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో ఒక చిన్న పొరపాటు పెద్ద దుమారానికే దారితీసింది. ఉప సర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు చేశారంటూ వెలువడిన వార్తలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.ఇటీవల పంచాయతీల నిర్వహణ, నిధుల వినియోగంపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, ఈ ఉత్తర్వుల్లో ఉప సర్పంచుల ఉమ్మడి సంతకం అధికారం గురించి ప్రస్తావించకపోవడంతో, ఆ అధికారం రద్దు అయిందని మీడియా మరియు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనిపై ఉప సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వార్తలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. “ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు కాలేదు.. అదంతా అపోహ మాత్రమే” అని ఆమె తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం లేదని, గ్రామ పాలనలో ఉప సర్పంచుల పాత్ర కీలకమని ఆమె పునరుద్ఘాటించారు.
సవరణకు సిద్ధమైన పంచాయతీ రాజ్ శాఖ
ప్రస్తుతం నెలకొన్న ఈ అయోమయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.పాత ఉత్తర్వుల్లో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, చెక్ పవర్‌పై పూర్తి స్పష్టతనిచ్చేలా కొత్త గైడ్ లైన్స్ జారీ చేయనున్నారు.మరికాసేపట్లో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి సవరించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.




