జిల్లాలో పెరిగిన నేరాలు…!

- గతేడాదితో పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య
- ప్రాపర్టీ రికవరీలో 12 శాతం పురోగతి
- సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల నమోదులో స్వల్ప పెరుగుదల నమోదైందని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.
గత ఏడాది జిల్లాలో 3,691 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ చివరి నాటికే ఆ సంఖ్య 3,813కి పెరిగింది. అంటే గతేడాది కంటే 3 శాతం నేరాలు పెరిగాయి. అయితే, కేసుల ఛేదనలో పోలీసులు వేగం పెంచారని, ముఖ్యంగా పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేయడంలో 12 శాతం పురోగతి సాధించామని ఆమె వివరించారు.నేటి కాలంలో సైబర్ నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. “సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుతూ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజలు అపరిచిత లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.జిల్లాలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, భద్రతా చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.నేరాల అదుపునకు క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్, నిఘా పెంచినట్లు వెల్లడించారు.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




