
- రేపు తాండూర్‌లో బీసీ సర్పంచులకు ఘన సన్మానం
- రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యక్రమ నిర్వహణ
- హాజరుకానున్న విద్యావేత్తలు, మేధావులు
- విజయవంతం చేయాలని బీసీ సంఘం నేతల పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో రేపు ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన బీసీ ప్రజాప్రతినిధులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం బీసీ సంఘం నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, బీసీల ఐక్యతను మరియు రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సన్మాన సభకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి. మధుసూదన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సాయి పుత్ర డెవలపర్స్ ప్రతినిధి శంకర్ యాదవ్ అతిథులుగా హాజరు అవుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు పలువురు విద్యావేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొంటారు.గ్రామస్థాయి పాలనలో బీసీల పాత్రను గుర్తిస్తూ, వారి విజయాలను సమాజానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తాండూర్‌లోని ఎంపీటీ హాల్ ఫంక్షన్ హాల్‌లో రేపు ఉదయం 10:30 గంటలకు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గంలోని బీసీ సర్పంచులు, బీసీ బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయాలని బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, బసవరాజ్, రాము ముదిరాజ్, వెంకటేష్, పండు గౌడ్, పరమేష్, బాల్రాజ్, చరణ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.



