
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- సర్పంచుల సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
- తాండూరు నియోజకవర్గంలో 25 ఏకగ్రీవాలు కావడం గర్వకారణం
- త్వరలోనే గ్రామాల అభివృద్ధికి భారీగా నిధుల విడుదల
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం శంషాబాద్ పట్టణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులను వారు ఘనంగా సన్మానించారు.
సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా వీధిదీపాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి కనీస అవసరాల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. మీ సేవానిరతి, ఆలోచనలే ప్రజల్లో మీకు గుర్తింపును తెచ్చిపెడతాయాని, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ, బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి” అని ఆయన పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోనే అత్యధికంగా తాండూరు నియోజకవర్గం నుండి 25 స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషమన్నారు. సర్పంచులుగా మీ పనితనమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి పునాది కావాలని ఆయన ఆకాంక్షించారు.గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారని, గత రెండేళ్లుగా పాలకవర్గాలు లేక గ్రామాల్లో పాలన కుంటుపడిందని ఎమ్మెల్యే విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే గత రెండేళ్ల ఆర్థిక సంఘం నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీగా అభివృద్ధి నిధులను విడుదల చేయబోతుందని భరోసా ఇచ్చారు. సర్పంచులు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, వారందరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ధారసింగ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నూతన సర్పంచులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




