- బీఆర్‌ఎస్‌వీ టౌన్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి రాజీనామా
- పార్టీ లో యువకులకు దక్కని ప్రాధాన్యత
- పారాషూట్ నాయకులకే పట్టం
- ప్రాధాన్యత ఉన్న పార్టీలోకి ప్రయాణం
- సందీప్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : బీఆర్‌ఎస్ పార్టీకి తాండూర్ పట్టణం లోని పలువురు నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సందీప్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ కోసం తెగించి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని, కేవలం ‘పారాచూట్’ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారావ్. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వీరాభిమానిగా గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి, పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ యువతకు పెద్దపీట వేస్తామని హితబోధ చేస్తారు. కానీ తాండూర్‌లో మాత్రం జెండా పట్టుకుని పోరాడే యువతకు మొండిచేయి ఎదురవుతోందన్నారు. పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉన్నా, గత రెండున్నర ఏళ్లుగా నమ్ముకుని ఉన్నందుకు మాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా? అని ప్రశ్నించారు.పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారిపై కేసులు నమోదవుతున్నా నాయకత్వం పట్టించుకోవడం లేదని, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం రెడ్ కార్పెట్ వేసి టికెట్లు, పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నారు. నాలాగే జెండా మోస్తూ మోసపోతున్న యువకులంతా కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు.యువతకు మరియు కష్టపడే కార్యకర్తలకు గౌరవం ఇచ్చే పార్టీలో త్వరలోనే చేరుతానని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు.






