- అధికారులను నిలదీసిన గ్రామస్థులు
- పథకాలు అందడం లేదని ఆవేదన.. సభలో తోపులాట
- రంగప్రవేశం చేసిన పోలీసులు.. అధికారులపై మాజీ సర్పంచ్ ఫైర్
జనవాహిని ప్రతినిధి తాండూరు : పెద్దేముల్ మండల పరిధిలోని గాజీపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ రణరంగంగా మారింది. ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ప్రజా పాలన’ పేరుతో ప్రభుత్వం ప్రజలను వమ్ము చేస్తోందని గ్రామస్థులు అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, మహిళలకు నెలకు రూ. 2500 సాయం వంటి పథకాలు ఎప్పుడు అందుతాయని నిలదీశారు. ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా ఫలితం లేదు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలు కూడా మాకు అందడం లేదు. ప్రజా పాలన అంటే కేవలం సంబరాలు చేసుకోవడమేనా?” అంటూ గ్రామ ప్రజలు మండిపడ్డారు. గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని, కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ గందరగోళంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అధికారులను చుట్టుముట్టిన ప్రజలను సముదాయించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే సభ తిరిగి కొనసాగింది.అధికారుల ఏకపక్ష ధోరణిపై మాజీ సర్పంచ్ తలారి వీరప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల కనీస ఆమోదం లేకుండా గ్రామసభలో తీర్మానాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై జిల్లా పంచాయతీ అధికారి,మరియు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



