- సద్దుమణిగిన ‘ధోబీఘాట్’ వివాదం
- కౌన్సిలర్ – రజక సంఘం మధ్య రాజీ.. కుదిర్చిన ముఖ్య నేతలు
- ధోబిఘాట్ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం…!
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత ఐదు రోజులుగా తాండూరు పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసిన 22వ వార్డు కౌన్సిలర్ రాము మరియు స్థానిక రజక సంఘం సభ్యుల మధ్య వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. పట్టణంలోని ధోబీఘాట్ కేంద్రంగా మొదలైన ఈ ‘పంచాయతీ’ని నియోజకవర్గ ముఖ్య నేతలు జోక్యం చేసుకుని పరిష్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్ రెడ్డి, రావి గౌడ్, మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ లు రజక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు గౌరవాధ్యక్షులతో,ఇరువర్గాలను పిలిపించి చర్చలు జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, పట్టణ శాంతిభద్రతల దృష్ట్యా సామరస్యంగా వెళ్లాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు గతంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులను, నమోదైన కేసులను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.వివాదానికి కారణమైన ధోబీఘాట్ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైన నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రజక సంఘం సభ్యులతోపాటుకు ఎల్లప్పుడూ కృషి ఉంటుందని తెలిపారు. గత ఐదు రోజులుగా నిరసనలు, ఆరోపణలతో వేడెక్కిన తాండూరు రాజకీయాలు ఈ రాజీతో ఒక్కసారిగా చల్లబడ్డాయి. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని నాయకులు సూచించారు.



