కేంద్రంతో కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి..!

- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- దేశాభివృద్ధే బీజేపీ ఏకైక లక్ష్యం
- కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు పేరు మార్చి వాడుకుంటున్నాయని విమర్శ
- మంబాపూర్‌లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ
తాండూరు జానవాహిని ప్రతినిధి:
దేశాభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్రంతో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల భారీ బీజేపీ జెండాను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అప్పుడే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కోసం పంపిస్తున్న వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి, ఆ నిధులను తామే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.కార్యక్రమంలో ముందుగా 30 అడుగుల ఎత్తైన బీజేపీ జెండాను కార్యకర్తల జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య ఎంపీ ఆవిష్కరించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



