- భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవం
- మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు ఆధ్వర్యంలో వేడుకలు
- పాల్గొన్న తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి
- కన్నుల పండువగా అభిజిత్ లగ్న కల్యాణ ఘట్టం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఆదర్శ తులసీనగర్ కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక వరసిద్ధి వినాయక మందిరంలో శ్రీ సీతారామచంద్రమూర్తి కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి మరియు 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు.మధ్యాహ్నం 12:05 గంటలకు అభిజిత్ లగ్న పుష్యరాంశ సుముహూర్తమున అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతమ్మ వారిని రామయ్యకు ధారపోశారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ‘జై శ్రీరామ్’ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బిఓఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లోక కల్యాణం కోసం జరిగిన ఈ పవిత్ర క్రతువులో పాల్గొనడం అదృష్టమని, రామయ్య ఆశీస్సులతో తాండూరు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఛైర్పర్సన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కాలనీ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.





