ఇక అన్నిటికి బ్రేక్….?

- స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!
- సంక్షేమ పథకాలకు తాత్కాలిక బ్రేక్?
- 22% రిజర్వేషన్ కే బీసీ లు పరిమితం
- పత్తి రైతులకు ఉపశమనం కలిగేనా..
జనవాహిని ప్రతినిధి: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నడంతో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు మరియు నిధుల విడుదలపై తాత్కాలిక బ్రేక్ పాడే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గృహ నిర్మాణం, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలపై ఈ కోడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మహిళా శక్తి ఇందిరమ్మ చీరల’ పంపిణీకి బ్రేక్..:
రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన ‘మహిళా శక్తి ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోనుంది. తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ వీటిని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. చాలా ప్రాంతాల్లో చీరల పంపిణీని మహిళా సంఘాల ద్వారా ప్రారంభించినప్పటికీ, కోడ్ అమలుతో ఈ ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోనుంది. దీనితో, చీరల కోసం అర్హులైన మహిళలు మరికొన్ని మూడు నెలలు, (ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు) ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరల నిల్వపై అధికారులు త్వరలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇళ్లు: మార్గదర్శకాలు ప్రశ్నార్థకం…?
కొత్తగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియపై ఎన్నికల కోడ్ ప్రభావం పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఎలా వర్తిస్తాయనే అంశంపై స్పష్టత కొరవడింది.నాలుగు దశల్లో రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకంలో, కోడ్ కారణంగా తదుపరి విడత నిధుల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇది లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నిధులు పొంది, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సంబంధించిన చెల్లింపుల విషయంలో కమిషన్ మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
స్వయం సహాయక సంఘాలకు రూ.304 కోట్ల విడుదల ఆలస్యమేనా
గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాల (వడ్డీ చెల్లింపు) విడుదల కార్యక్రమం నేడు (నవంబర్ 25) అన్ని జిల్లాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి.అయితే, ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుండడంతో, ఈ నిధుల విడుదల కార్యక్రమం ఆలస్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం లబ్ధిదారులకు వడ్డీ చెల్లింపు కాబట్టి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి, కోడ్ పరిధి నుంచి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కోడ్ అమలైతే, 3.5 లక్షలకు పైగా సంఘాలకు నిధులు చేరడం వాయిదా పడుతుంది.
పత్తి రైతులకు ఉపశమనం: కోడ్ తెచ్చేదెంత?
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల విషయంలో కొద్ది రోజులుగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీసీఐ కొనుగోళ్ల పరిమితులు, యాప్ బుకింగ్‌లు వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వలన పత్తి రైతులకు నిజంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. కోడ్ ఉన్నందున, ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించడంగానీ, కొనుగోలు ప్రక్రియలో పెద్ద మార్పులు తీసుకురావడంగానీ సాధ్యం కాదు. అయితే, ప్రతిపక్షాలు ఈ సమస్యను ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసే అవకాశం ఉన్నందున, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోనే రైతులకు కొనుగోలు ప్రక్రియలో సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్ జీవో 46 ప్రకారమే..!
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ 42% రిజర్వేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాంతం రిజెర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కళగానే మిగిలిపోనుంది. నేడు వెలువడే ఎన్నికల నోటిఫికేషన్ తో పాత 22% రిజర్వేషన్ ప్రకారమే బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.
సమస్త సంక్షేమ పథకాలపై, ముఖ్యంగా నిధుల విడుదల, లబ్ధిదారుల ఎంపికపై స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ప్రభావం చూపడం అనివార్యంగా మారింది. ఎన్నికల కమిషన్ తదుపరి మార్గదర్శకాలను బట్టి ఈ కార్యక్రమాల పురోగతి ఆధారపడి ఉంటుంది.



