- ఆస్తి గొడవలో తమ్ముడి దారుణ హత్య
- అన్న, బామ్మర్ది కలిసి ఘాతుకం
- తాండూరు పట్టణం మాణిక్ నగర్‌లో కలకలం
జనవాహిని ప్రతినిధి తాండూరు : సొంత తమ్ముడే అనే కనికరం లేకుండా ఆస్తి కోసం ఒక అన్న కాలయముడిగా మారాడు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణం తీసే వరకు వెళ్ళింది. ఈ విషాదకర ఘటన తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్, రెహమాన్ అన్నదమ్ములు. రెహమాన్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి విషయం తేల్చుకుందామని నమ్మబలికిన అన్న మోసిన్, తమ్ముడు రెహమాన్‌ను హైదరాబాద్ నుండి తాండూరుకు పిలిపించాడు.ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య స్థలం విషయంపై చర్చ జరుగుతుండగా మళ్ళీ ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన మోసిన్, తన బామ్మర్ది సహాయంతో రెహమాన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య సమాచారం అందిన వెంటనే తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.






