అదనపు కట్నం వేధింపులే ప్రాణం తీశాయి!

- భార్యను కొట్టి చంపిన కిరాతక భర్త
- తాండూరు సాయిపూర్‌లో దారుణం
- భర్త, అత్తమామల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : అదనపు కట్నం కోసం ఓ వివాహితను భర్త కట్టెతో కొట్టి చంపిన దారుణ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ఏరియాలో చోటుచేసుకుంది. తాండూరు సిఐ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపూర్‌కు చెందిన బోర్ర పరమేష్‌కు, అనూష అలియాస్ కల్పనతో ఏడు నెలల క్రితం వివాహమైంది. వివాహమైన కొద్దిరోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్త పరమేష్, అత్తమామలు లాలమ్మ, మొగులప్పలు కల్పనను వేధించడం మొదలుపెట్టారు.
సోమవారం ఉదయం కల్పన అన్నం వండగా.. పాత అన్నం ఉండగా మళ్లీ ఎందుకు వండావని పరమేష్ ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహంతో భార్యను కాళ్లతో తన్ని, చేతులతో కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మామ మొగులప్ప గాయపడిన కోడలిని ఆమె తల్లిగారి ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. తల్లి చంద్రమ్మ తన కూతురిని స్థానిక ఆదిత్య ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది.
కట్టెతో కొట్టి హత్య..
మంగళవారం కల్పనను చికిత్స నిమిత్తం మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా.. బాలాజీ ఆసుపత్రి సమీపంలో పరమేష్ వారిని అడ్డగించాడు. “నా భార్యను నేనే చూసుకుంటాను” అంటూ గొడవపడి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి చేరిన తర్వాత పరమేష్ కట్టెతో కల్పన తలపై ఆరుసార్లు బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మృతురాలి తల్లి కట్టెల చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను పట్టుకున్నారు. నిందితులు బోర్ర పరమేష్, బోర్ర మొగులప్ప, బోర్ర లాలమ్మలను అరెస్ట్ చేసి తాండూరు కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని పరిగి జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.



